తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి - మదింపు ప్రక్రియలు - TS TRT

Post Top Ad

Your Ad Spot

Sunday, 2 October 2016

తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి - మదింపు ప్రక్రియలు


తెలంగాణ 2014 జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. భౌగోళికంగా ఇది పూర్తిగా దక్కన్ పీఠభూమి మధ్యభాగంలో విస్తరించి ఉంది. రాష్ట్ర విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణ పరంగా, జనాభా పరంగా ఇది దేశంలో 12వ పెద్ద రాష్ట్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,51,93,978 మంది. రాష్ట్రం స్థూల ఆర్థికాభివృద్ధిలో గణనీయ ఫలితాలు సాధిస్తూ ముందడుగేస్తోంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులున్నాయి. ఈ ప్రాంత భౌగోళిక, వాతావరణ స్థితిగతులు, సహజ వనరుల లభ్యత, సామాజిక నిర్మితి తదితరాలు ఆర్థికాభివృద్ధికి సోపానాలుగా ఉన్నాయి


ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా మూడు రంగాలుగా వర్గీకరించారు. అవి:
1. ప్రాథమిక రంగం (Primary Sector)
2. ద్వితీయ రంగం (Secondary Sector)
3. తృతీయ రంగం (Tertiary Sector)
వీటిని వివిధ ప్రధాన వృత్తుల ఆధారంగా విభజించారు. ఒక దేశంలోని జనాభా వివిధ వృత్తుల్లో పనిచేసే తీరును ఈ వృత్తుల వారీ విభజన తెలుపుతుంది. జాతీయ/ రాష్ట్ర ఆదాయానికి ఏయే రంగాల ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుందో తెలుసుకోవడానికి, వాటి అభివృద్ధి, పెరుగుదల శాతాల్లో ఏ విధమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయో అర్థం చేసుకొని తగిన సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ఈ విభజన తోడ్పడుతుంది. వివిధ ఆర్థిక రంగ అభివృద్ధి ప్రక్రియలు దేశ పురోభివృద్ధి గమనాన్ని, సామాజిక, ఆర్థిక వ్యవస్థలను అధికంగా ప్రభావితం చేస్తాయి.
ప్రాథమిక రంగంలోని ఉప రంగాలు: వ్యవసాయం, పశుసంపద - పాడి పరిశ్రమ, అడవులు - అటవీ ఉత్పత్తులు, మత్స్య పరిశ్రమ, గనులు, తవ్వకాలు.
ద్వితీయ రంగంలోని ఉప రంగాలు: వస్తూత్పత్తి తయారీ పరిశ్రమలు, నిర్మాణ రంగం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా.
తృతీయ రంగంలోని ఉప రంగాలు: వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, నిల్వలు, సమాచార వ్యవస్థ, రైల్వేలు, రక్షణ, తపాలా సేవలు, ఫైనాన్సింగ్, బీమా, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, సామాజిక వ్యక్తిగత సేవలు, ప్రజాపరిపాలన, ఇతర సేవలు.
సాధారణంగా వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగంగా, పారిశ్రామిక రంగాన్ని ద్వితీయ రంగంగా, సేవా రంగాన్ని తృతీయ రంగంగా పేర్కొంటారు. అయితే ‘గనులు, తవ్వకాలు’ అనే ఉప రంగం లేని ప్రాథమిక రంగంలోని అంశాలను వ్యవసాయ రంగంగా భావిస్తారు. ‘గనులు, తవ్వకాలు’ ఉప రంగంతో కూడిన ద్వితీయ రంగంలోని అంశాలను పారిశ్రామిక రంగంగా గుర్తిస్తారు. తృతీయ రంగంలోని అంశాలన్నీ సేవల రంగం కిందకి వస్తాయి. ఈ ముఖ్య ఆర్థిక రంగాల్లో వివిధ ఉప రంగాల వారీగా ఆదాయం, వృద్ధి, మొత్తం ఆదాయంలో వాటి వాటాను మదింపు చేసి జాతీయాదాయం లేదా రాష్ట్ర ప్రాంతీయాదాయాన్ని తెలుసుకుంటారు. ‘కేంద్ర గణాంక సంస్థ’ (Central Statistical Organisation - CSO) జాతీయాదాయాన్ని అంచనా వేస్తుంది. రాష్ట్ర ఆర్థిక గణాంక సంచాలకులు రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేస్తారు. ఇందులో భాగంగా వీరు వివిధ లెక్కింపు పద్ధతుల ద్వారా గణాంకాలను రూపొందిస్తారు.

ఆదాయ మదింపు పద్ధతులు
సాధారణంగా జాతీయ లేదా రాష్ట్ర ఆదాయాన్ని 3 రకాల పద్ధతుల్లో లెక్కిస్తారు. అవి:
1. ఉత్పత్తి లేదా నికర ఉత్పత్తి పద్ధతి
2. ఆదాయ పద్ధతి (నికర ఆదాయ పద్ధతి)
3. వ్యయ పద్ధతి
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ మూడు పద్ధతులనే అనుసరిస్తున్నారు. మన దేశంలో (అన్ని రాష్ట్రాల్లోనూ) ఉత్పత్తి, ఆదాయ మదింపు పద్ధతుల ఆధారంగా జాతీయదాయాన్ని గణిస్తున్నారు.
ఉత్పత్తి మదింపు పద్ధతి
దీన్ని విలువ జోడించిన పద్ధతి (Value Added Method), Industrial Origin Method, Inventory Method అని కూడా అంటారు. ప్రముఖ ఆర్థికవేత్త సైమన్ కుజినెట్స్ ఈ పద్ధతిని ‘ఉత్పత్తి సేవా పద్ధతి’గా పేర్కొన్నాడు. ఆర్థిక వ్యవస్థలో ఏడాది కాలంలో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని కలిపితే ‘నికర ఉత్పత్తి’ వస్తుంది. ఈ విలువను జాతీయాదాయం లేదా రాష్ట్ర ప్రాంతీయాదాయంగా భావిస్తారు. ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో జరిగిన ఉత్పత్తిని కలిపితే మొత్తం ఉత్పత్తి వస్తుంది. అయితే ఒక రంగంలో జరిగిన ఉత్పత్తిని మరో రంగంలో ఉత్పత్తి కారకాలు (మాధ్యమిక వస్తువులు)గా ఉపయోగించవచ్చు. కాబట్టి వాటి విలువను లెక్కలోకి తీసుకోకూడదు. అంటే ఒకే వస్తువును రెండుసార్లు లెక్కించకూడదు. ఈ పద్ధతిలో.. జాతీయాదాయం = కారకాల దృష్ట్యా నికర దేశీయోత్పత్తి + నికర విదేశీ కారకాల ఆదాయాలు.
ఆదాయ మదింపు పద్ధతి
దీన్ని కారక చెల్లింపు పద్ధతి (Factor Payment Method), వాటాల పంపిణీ పద్ధతి (Distributed Share Method), ఆదాయ చెల్లింపు పద్ధతి (Income Paid Method), ఆదాయ గ్రాహక పద్ధతి (Income Received Method) అని పిలుస్తారు. ఈ పద్ధతిలో జాతీయ/ రాష్ట్ర ఆదాయాన్ని పంపిణీ కోణం నుంచి లెక్కిస్తారు. వివిధ ఉత్పత్తి కారకాలు.. అంటే శ్రమపై వచ్చే వేతనాలు, భూమిపై వచ్చే అద్దె, మూలధనంపై వచ్చే వడ్డీ, పరిశ్రమ వ్యవస్థాపకుడికి వచ్చే లాభాలు, వీటన్నింటి ప్రతిఫలాల మొత్తం విలువతో పాటు నికర విదేశీ ఆదాయాలను కలిపితే వచ్చేదే జాతీయాదాయం. ఈ పద్ధతిలో వివిధ ఉత్పత్తి కారకాల మధ్య జాతీయాదాయం ఏ విధంగా పంపిణీ అయిందో తెలుసుకోవచ్చు. దీంతో పాటు వివిధ వర్గాల ప్రజలకు ఎంతెంత ఆదాయం వస్తుందో అంచనా వేయవచ్చు. ఆదాయ మదింపు పద్ధతిలో.. జాతీయాదాయం = వేతనం + భాటకం + వడ్డీ + లాభాలు + నికర విదేశీ ఆదాయాలు.
వ్యయాల మదింపు పద్ధతి
ఇది ఆధునిక పద్ధతి. దీన్ని ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్నారు. భారతదేశంలో ఇది అంతగా వినియోగంలో లేదు. ఈ పద్ధతిలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం ఒక ఏడాది కాలంలో అంతిమ వస్తు సేవలపై చేసే మొత్తం వ్యయాన్ని లెక్కించడం ద్వారా జాతీయాదాయాన్ని గణిస్తారు. జాతీయాదాయ లెక్కింపు పద్ధతులన్నింటిలో ఇది చాలా కచ్చితమైంది. దీన్ని వినియోగ - పెట్టుబడి పద్ధతి అని కూడా అంటారు. ఈ వ్యయ మదింపు పద్ధతిని ప్రఖ్యాత ఆర్థికవేత్త జే.ఎం. కీన్‌‌స రూపొందించారు. ఈ పద్ధతిలో జాతీయాదాయం = గృహ సంబంధ వ్యయాలు + సంస్థల వ్యయాలు + ప్రభుత్వ వ్యయాలు.
 
ఆదాయ లెక్కింపు - ప్రామాణిక ధరలు
జాతీయ, రాష్ట్ర ప్రాంతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు సాధారణంగా రెండు రకాల ధరలను ప్రామాణికంగా తీసుకుంటారు.
ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం
ప్రస్తుత సంవత్సరం ఆచరణలో ఉన్న వస్తు సేవల ధరల్లో ఆదాయాన్ని లెక్కిస్తే దాన్ని ‘ప్రస్తుత ధరల్లో ఆదాయం’ లేదా ‘నామమాత్రపు ఆదాయం’ అంటారు.
ఉదా: 2014-15 జాతీయాదాయన్ని లెక్కించేటప్పుడు 2014-15లోని ధరలనే ప్రామాణికంగా తీసుకోవడం.
ప్రస్తుత ధరల్లో ఆదాయాన్ని లెక్కించినప్పుడు.. గతేడాది, ప్రస్తుత సంవత్సరం జాతీయాదాయాలను సరిపోలిస్తే ఉత్పత్తి పెరగనప్పటికీ ధరలు అధికమవడం వల్ల జాతీయదాయం పెరిగినట్లు ఫలితాలు రావచ్చు. ఎందుకంటే వస్తు సేవల ధరలు అనేక కారణాల వల్ల రోజురోజుకూ పెరుగుతుంటాయి. ధరలు పెరగడం వల్ల ఆదాయం అధికమైనట్లు గోచరిస్తుంది. ఈ కారణంగా వాస్తవ వస్తు సేవల ఉత్పత్తులను అంచనా వేయలేం. అందువల్ల ఈ పద్ధతిలో వాస్తవ జాతీయాదాయాన్ని లెక్కించడం వీలు కాదు.
స్థిర (ప్రామాణిక) ధరల్లో జాతీయాదాయం
ఏ విధమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక, ప్రకృతి పరమైన ఒడుదొడుకులు లేకుండా ఉత్పత్తి మంచిగా జరిగిన ఒకానొక సంవత్సరాన్ని ఆధార సంవత్సరం (బేస్ ఇయర్)గా తీసుకొని ఆ ధరల ఆధారంగా జాతీయాదాయాన్ని లెక్కిస్తే దాన్ని ‘స్థిర ధరల్లో ఆదాయం’ లేదా ‘వాస్తవ ఆదాయం’ అంటారు.
ఉదా: 2014-15 జాతీయాదాయాన్ని లెక్కించేటప్పుడు 2004-05 ధరలను ప్రామాణికంగా తీసుకోవడం.
స్థిర ధరల్లో జాతీయాదాయాన్ని లెక్కించడానికి కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌వో) ఎప్పటికప్పుడూ ఆధార సంవత్సరాన్ని నిర్ధారిస్తుంది. మన దేశంలో ఇప్పటివరకూ 1948-49, 1960-61, 1970-71, 1980-81, 1993-94, 1999-2000, 2004-05లను ఆధార సంవత్సరాలుగా తీసుకున్నారు.
ప్రస్తుత ధరల్లో ఆదాయాన్ని గణించినప్పటికీ దాన్ని ‘ధరల సూచీ’ (Price Deflator) ఆధారంగా స్థిర ధరల్లోకి మార్చవచ్చు.
స్థిర ధరల్లో ఆదాయం = (ప్రస్తుత ధరల్లో ఆదాయం / ధరల సూచీ) × 100
స్థూల రాష్ట్రోత్పత్తి (జీఎస్‌డీపీ)
ఒక రాష్ట్ర భౌగోళిక హద్దుల మధ్య, నిర్ణీత కాల వ్యవధిలో (సాధారణంగా ఒక సంవత్సరం) ఉత్పత్తి చేసిన వస్తువుల, సేవల మొత్తం విలువను స్థూల రాష్ట్రోత్పత్తి (Gross State Domestic Product - GSDP) అంటారు. జీఎస్‌డీపీ నుంచి ‘తరుగుదల’ను తీసేస్తే ‘నికర రాష్ట్రోత్పత్తి (Net State Domestic Product - NSDP) వస్తుంది. సాధారణంగా జీఎస్‌డీపీనే రాష్ట్ర ఆదాయంగా పరిగణిస్తారు. కానీ, ఆర్థిక పరిభాషలో రాష్ట్ర ఆదాయం అంటే ఎన్‌ఎస్‌డీపీ. వీటిని గణించేటప్పుడు ఒక రాష్ట్రంలోని వారు ఇతర రాష్ట్రాల్లో సంపాదించిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోరు.
రాష్ట్ర తలసరి ఆదాయం = ఎన్‌ఎస్‌డీపీ ÷ రాష్ట్ర జనాభా
స్థూల జిల్లా ఉత్పత్తి (జీడీడీపీ)
ఒక జిల్లాలో ఏడాది కాలంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువను ‘స్థూల జిల్లా ఉత్పత్తి’ (Gross District Domestic Product - GDDP) అంటారు.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి - దృగ్విషయాలు
జీఎస్‌డీపీ లెక్కింపునకు అనువుగా ఉండటానికి రాష్ట్రంలో మూడు రంగాలను తొమ్మిది విభాగాలుగా విభజించారు. ఈ పద్దులను కింది విధంగా వర్గీకరించారు.
  1. వ్యవసాయ రంగం
    1.1 (ఎ) వ్యవసాయం
    1.1 (బి) జీవోత్పత్తులు (పశు సంపద - పాడి పరిశ్రమ)
    1.2 అటవీ ఉత్పత్తులు, కలప
    1.3 మత్స్య సేకరణ
  2. పారిశ్రామిక రంగం
    2. గనులు, తవ్వకాలు
    3. వస్తూత్పత్తి
    4. విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా
    5. నిర్మాణాలు
  3. సేవల రంగం
    6. వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు
    7.1 రైల్వేలు
    7.2 రవాణా, నిల్వ చేయడం
    7.3 సమాచార సంబంధాలు
    8. రుణ సహాయం (ఫైనాన్సింగ్), బీమా, స్థిరాస్తులు, వ్యాపార సేవలు
    9. సామూహిక, సామాజిక, వ్యక్తి స్థాయి సేవలు, ఇతర సేవలు
వీటిలో మొదటి మూడు అంశాలను ఉత్పత్తి మదింపు పద్ధతి; 4, 6, 7, 8, 9లోని అంశాలను ఆదాయ మదింపు పద్ధతి; 5వ అంశాన్ని (నిర్మాణ రంగం) వ్యయ మదింపు పద్ధతి ద్వారా గణిస్తున్నారు
Tags: Telangana Gross Production Telangana Economic System Telangana Economy Study Material TSPSC Groups Study Material

No comments:

Post a Comment

Post Top Ad