భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి అధికవృద్ధి పథంలో పయనిస్తోందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చెప్పారు. ప్రభుత్వ సుస్థిర కృషి, విధాన నిర్ణయాల వల్ల ఇది సాధ్యమయిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక చర్యల వల్ల ద్రవ్యోల్బణం, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి సోమవారం ప్రసంగించారు. భూసేకరణతో ప్రభావితమయ్యే రైతుల ప్రయోజనాలను కాపాడడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్రపతి స్పష్టం చేశారు. పార్లమెంట్ సజావుగా నడిచేందుకు సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ విపక్షాలు నిరసనగళం వినిపిస్తాయని కథనాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగంలో ఈ అంశాలు చోటు చేసుకోవడం విశేషం. మోదీ ప్రభుత్వం కొలువుతీరాక 9 నెలల కాలంలో ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలను, కార్యక్రమాలను, విధానాలను గంట పాటుసాగిన 18 పేజీల ప్రసంగ పాఠంలో రాష్ట్రపతి వివరించారు. 'అందరితో కలిసి.. అందరి అభివృద్ధి' అనేది తన ప్రభుత్వ ప్రాథమిక సూత్రమని స్పష్టం చేశారు. దేశంలోని 125 మంది కోట్ల ప్రజల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి సమగ్ర వ్యూహానికి రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. దాదాపు అన్ని రంగాలనూ ఆయన స్పృశించారు. భూసేకరణతో ప్రభావితమయ్యే రైతులు, కుటుంబాల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనకు, గ్రామీణ ప్రాంతాల్లో గృహవసతి, పాఠశాలలు, ఆస్పత్రుల వంటి ప్రాథమిక వసతుల కల్పనకు భూసేకరణ అవసరం. భూసేకరణలో పారదర్శకతను పాటించడం, సరసమైన పరిహారం పొందే హక్కు సహా రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు భూసేకరణ ప్రక్రియలో సమస్యలను తగ్గించడానికి పునరావాస చట్టాన్ని తగిన విధంగా మెరుగుపర్చాం. విలువ ఆధారిత వ్యవసాయం అవసరం. మార్కెట్ సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అవసరం. తాజా అంచనాల ప్రకారం మన స్థూల జాతీయోత్పత్తి 7.4శాతం వృద్ధి రేటుతో ఉంది. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. కొన్నేళ్లుగా దాదాపుగా స్తంభించిపోయిన స్థిర మూలధన కల్పన (ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఫార్మేషన్).. ఇప్పుడు పెరిగింది. మూలధన విపణి.. ఉత్సాహంతో ఉంది. మన విదేశీ మారకద్రవ్య నిల్వలు గణనీయంగా పెరిగాయి. నిలకడగా ఉన్న రూపాయితో భారత అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ చాలా ఉత్సాహంగా ఉంది. నల్లధనం నియంత్రణకు... విచారణ వేగవంతం చేయడం, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమాచారాన్ని ఏకీకరించడం, సమర్థమైన చట్ట, పరిపాలన చట్రాలను, వ్యవస్థలను, ప్రక్రియలను రూపొందించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. పేదరిక నిర్మూలనకు ఆర్థిక సమ్మిళితం ముఖ్యం. అందరికీ బ్యాంకింగ్ వసతి కల్పించడానికి ప్రభుత్వం.. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రూ.11వేల కోట్లు జమ అయ్యాయి. ఈ అనూహ్య లక్ష్యాన్ని ఆరునెలల కన్నా తక్కువ కాలంలోనే సాధించాం. ఇటువంటి కార్యక్రమాల్లో ఇది ప్రపంచంలోనే పెద్దది. అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారుకు లొసుగులు లేకుండా చేరడానికి ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద కార్యక్రమం. అందరినీ ఆధార్ నమోదు పరిధిలోకి తీసుకురావడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం. మొత్తం జీవన నాణ్యతపై, వ్యక్తి శ్రేయస్సుపై పరిశుభ్రత ముఖ్యమైన ప్రభావం చూపుతుంది. దేశ అభివృద్ధిపైనా ఇది ప్రభావం చూపుతుంది. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రతిఒక్కరినీ భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. 2022 నాటికి అందరికీ గృహవసతి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గృహనిర్మాణ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని ప్రభుత్వం సరళీకరించింది. గృహనిర్మాణ రుణాలకు పన్ను ప్రోత్సాహకాలను పెంచింది. ప్రాధాన్యాల్లో ప్రాధాన్యత విద్యకే. పాఠశాలలు లేని ఆవాసాలను జీఐఎస్ పరిజ్ఞానంతో గుర్తించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంచడానికి పండిత్ మదన్‌మోహన్ మాలవ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచంలోనే ఎక్కువమంది యువత ఉన్న దేశం భారత్. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం... కొత్తగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. నైపుణ్య భారత్‌లో భాగంగా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజనను ప్రకటించాం. హింసకు గురయ్యే మహిళలకు పూర్తి సహకారం అందించడానికి ప్రతి రాష్ట్రంలోనూ సంక్షోభ పరిష్కార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందులో వైద్య సహాయం, పోలీసు సహాయం, తాత్కాలిక ఆశ్రయం, న్యాయ సహాయం, మానసిక, సామాజిక కౌన్సెలింగ్ తదితర సేవలు అందుతాయి. న్యాయసంస్కరణలు ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటి. పరిపాలన, సంస్కరణలు అనేవి.. పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల శాసనసభలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రజలతో కూడిన టీమ్ ఇండియా ఉమ్మడి కృషి అన్నది ప్రభుత్వ విశ్వాసం. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియమాక ప్రక్రియకు జాతీయ జ్యుడిషియల్ నియామకాల కమిషన్ ఏర్పాటు కోసం తీసుకొచ్చిన సంస్కరణ ఇందుకు నిదర్శనం. బూజు పట్టిన చట్టాల రద్దుకూ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అవినీతి నియంత్రణకు కఠిన చర్యలను ప్రవేశపెడుతూనే ప్రజాప్రయోజనాల కోసం నిజాయితీతో తీసుకున్న నిర్ణయాల విషయంలో తగిన రక్షణలు కల్పిస్తాం. అధికారుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడానికి తగిన చర్యలు తీసుకుంటాం. భారత్‌ను సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత మార్పునకు సంసిద్ధం చేయడానికి డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. వ్యాపార ప్రక్రియలను సరళతరం చేయడానికి ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా... ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళీకరించడం, హేతుబద్ధీకరించడం జరిగింది. అనుమతులకు ఏకగవాక్ష పద్ధతిని అమల్లోకి తెచ్చాం. 'ఈబిజ్' వెబ్‌సైట్ ఇందుకోసమే. పన్ను వ్యవస్థలోకి మరింత సామర్థ్యాన్ని, నిష్పక్షపాతాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వ్యయ నిర్వహణలో ప్రాజ్ఞతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. వస్తు సేవల పన్ను విధానాన్ని తీసుకురావడానికి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పరోక్ష పన్ను విధానాన్ని ఇది సరళీకరిస్తుంది. పన్ను పరిధిని పెంచుతుంది. భారత్‌ను తయారీ కేంద్రంగా మలచడానికి భారత్‌లో తయారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఆర్థిక వృద్ధికి నగరాలు చోదకశక్తులు. పట్టణ ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నీటి, ఘన వ్యర్థాల నిర్వహణ మౌలికసదుపాయాలపై ప్రధానంగా దృష్టిసారిస్తూ జాతీయ పట్ణణ అభివృద్ధి కార్యక్రమానికి తుదిరూపం ఇస్తున్నాం. భాగస్వాములందరితోనూ విస్తృత సంప్రదింపుల అనంతరం స్మార్ట్‌నగరాల ప్రాజెక్టు తుది రూపం సంతరించుకుంటోంది. ఆర్థికవృద్ధి పరుగులు పెట్టడానికి మౌలిక సదుపాయాల వృద్ధి కీలకం. రైల్వేరంగంలో సంస్కరణలను ప్రభుత్వం చేపడుతోంది. విద్యుత్ రంగం గణనీయ ప్రగతి సాధించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన, సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకాన్ని ప్రారంభించాం. శుద్ధ ఇంధనానికి ప్రాధాన్యం. 25 మెగా సౌర విద్యుత్ పార్కు ఏర్పాటుకు పథకం ప్రారంభమయింది. సహజవనరుల కేటాయింపులో పారదర్శకతకు, వాటిని హేతుబద్ధంగా ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశంలో విద్యుత్ ఛార్జీలు తగ్గే విధంగా బొగ్గు క్షేత్రాల వేలం ప్రక్రియ ప్రారంభమయింది. నదుల అనుసంధానం ప్రాజెక్టును అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన గమ్యం.. మన పొరుగుతో ముడి పడి ఉందని గుర్తిస్తూ పొరుగు దేశాలతో సంబంధాలను ప్రభుత్వం బలోపేతం చేసింది. దక్షిణాసియాతో ప్రబల సహకారాన్ని ప్రోత్సహిస్తోంది. అమెరికా, రష్యా, చైనాలతోనే సంబంధాలు బలోపేతం చేస్తున్నాం.రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సోమవారం పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన భార్య సువ్ర ప్రేక్షకుల గ్యాలరీలో ఆసీనులైఉన్నారు. అత్యున్నత స్థాయి ప్రభుత్వాధికారులు, కేబినెట్ కార్యదర్శి తదితరులు ఆసీనులైన గ్యాలరీలో సువ్ర కూర్చుని భర్త ప్రసంగాన్ని విన్నారు.
Post Top Ad
Your Ad Spot
Monday, 23 February 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment