స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటిన తరువాత కూడా మన లౌకిక  ప్రజాస్వామిక వ్యవస్థ విషమ పరీక్షను ఎదుర్కొంటున్నది. మతం మారడం, వెనకకు  రావడం అనేది వ్యక్తి ఇష్టానికి పరిమితం కాకుండా సామాజిక, రాజకీయ వివాదంగా  మారిపోతున్నది. ధరమ్ జాగరణ్ సమితి అనే సంస్థ ఈ నెల ఎనిమిదవ తేదీన ఆగ్రాలో  ఘర్ వాపసీ కార్యక్రమం చేపట్టి రెండు వందల మంది ముస్లింలను హిందు మతంలోకి  మార్చిందని తెలుస్తున్నది. క్రిస్మస్ రోజున అలీగఢ్‌లో ఐదు వేల మందిని హిందు  మతంలోకి చేర్చుకుంటామని ఈ సంస్థ ప్రకటించింది. దీనిపై పార్లమెంటులో దుమారం  చెలరేగడంతో స్థానిక జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని నిషేధించింది. తాము  ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నామని, పై నుంచి అనుమతి రాగానే  నిర్వహిస్తామని సమితి నాయకులు అంటున్నారు.    బీహార్‌లోని భాగల్పూరు సమీపాన గల బరోహియా గ్రామంలో ఐదుగురు (హిందువులు)  క్రైస్తవ మతం పుచ్చుకున్నారని, వారిని కొందరు సంఘపరివార్ కార్యకర్తలు మళ్ళా  హిందు మతంలోకి మార్చారని అంటున్నారు. తమ వ్యాధి తగ్గినందువల్ల క్రీస్తు  పట్ల విశ్వాసం వ్యక్తం చేశామని, మతం మారలేదని ఆ ఐదుగురు చెప్పారని, తాము  ఇంకా దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు                 అంటున్నారు. కొందరు ఆరెస్సెస్ కార్యకర్తలు వీరిని మళ్ళా హిందు మతంలోకి  మార్చి అందుకు సంకేతంగా గంగానదిలో స్నానం చేయించి, ఆలయంలో పూజలు చేయించారని  స్థానికులు వెల్లడిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లా  కమలాపురి గ్రామంలో డ్బ్బై మంది హిందువులు క్రైస్తవ మతంలోకి మారారనే వార్త  ఉద్రిక్తతలు పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం మెజిస్టేరియల్ దర్యాప్తునకు  ఆదేశించింది. స్థానికులు కొందరు మతం మారలేదని అంటుండగా, మిగతా వారు ఇండ్లకు  తాళాలు వేసి పరారయ్యారు. దీనిని బట్టి ఉద్రిక్తతలు ఎంతగా పెరిగిపోతున్నాయో  తెలుస్తున్నది.   ఇతర మతాలకు హిందుమతస్తులను చేర్చుకునే హక్కు ఉన్నట్టే హిందు మత పెద్దలకు  ఇతరమతస్తులను చేర్చుకునే హక్కు ఉంటుంది. ప్రభుత్వం ఏ మతం వైపు మొగ్గు  చూపకుండా అన్ని మతాలను సమానంగా గౌరవించాలె. ఏమతస్తులు  బలవంతానికి,ప్రలోభాలకు పాల్పడకుండా పెద్ద మనిషి పాత్రను పోషించాలె. అన్ని  మతాల పెద్దలు కూడా పరస్పరం చర్చించుకొని సామరస్యం సాధిస్తే ఉద్రిక్తతలకు  తావుండదు.   మత మార్పిడుల పేరుతో ఉద్రిక్తతలు పెరిగిపోతుండడం పట్ల కొద్ది రోజులుగా  పార్లమెంటులో కూడా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇటీవలే లోక్‌సభలో ఓ కేంద్ర  మంత్రి మాట్లాడుతూ- అన్ని రాష్ర్టాలు, కేంద్రం మత మార్పిడుల నిరోధక చట్టం  చేయాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఐదు రాష్ర్టాలు ఇటువంటి చట్టాలు చేశాయి.  ఈ నేపథ్యంలో ఇటువంటి చట్టాలు సమస్యను పరిష్కరించగలుగుతాయా? అవి రాజ్యాంగ  స్ఫూర్తికి విరుద్ధం కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని  రాష్ర్టాలలో మాదిరిగా- మత మార్పిడి చేసుకోవాలంటే మొదట ప్రభుత్వానికి  సమాచారం అందించి నిర్దేశిత కాలం తరువాత మారాలని ఆంక్షలు పెట్టడం  ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆమోదనీయం కాదు. ఒక మనిషికి ఒక మతంపై లేదా దేవుడిపై  నమ్మకం ఏర్పడవచ్చు. అది అతడి వ్యక్తిగత విషయం. దీనిపై ప్రభుత్వ నియంత్రణ  ఉండడం భావ స్వేచ్ఛకు భంగకరం. రాజ్యాంగం కూడా మత స్వేచ్ఛను, మత ప్రచార  హక్కును గుర్తిస్తున్నది. బహుళత్వం భారతీయ సమాజ లక్షణం. వైదికంలోని భిన్న  శాఖలు, వైదికేతర బౌద్ధ జైన మతాలు భారతీయ సమాజాన్ని సుసంపన్నం చేశాయి.  ఇప్పటికీ వైదిక పరిధిలోకి రాకుండా గ్రామీణ దేవతలను పూజించేవారున్నారు.  ఒకప్పుడు రాజు ఒక మతాన్ని, రాణి మరో మతాన్ని అవలంబించిన సందర్భాలు ఉన్నాయి.  ఇటువంటి సహజీవన సంస్కృతిని కాపాడుకోవడం ఎట్లా అనేది మన రాజకీయ నాయకత్వం  ఆలోచించాలె.    బలవంతపు మత మార్పిడులను వ్యతిరేకించ వలసిందే. ప్రలోభాలతో మత మార్పిడి  చేయడం ఆయా మత సూత్రాలకే విరుద్ధం. అయితే వీటిని అరికట్టడం చట్టాలతో సాధ్యం  కాదు. ప్రజలను పేదరికం నుంచి బయట పడేయడం, విద్యావంతులను చేయడం ద్వారా ఈ  సమస్యను పరిష్కరించవచ్చు. మన దేశంలో హిందుమతం అధిక సంఖ్యాకుల విశ్వాసంగా  ఉన్నప్పటికీ, ప్రపంచం కుంచించుకుపోయిన నేపథ్యంలో ఒక రకమైన అల్పసంఖ్యాక  భావనకు, భద్రతా రాహిత్యానికి గురవుతున్నది. అందువల్ల ఈ మత ప్రముఖుల  ఆందోళనను అర్థం చేసుకోవచ్చు. అయితే కుల వ్యవస్థ, అస్పృశ్యత వంటి సామాజిక  జాడ్యాల వల్ల అట్టడుగు వర్గాల వారు స్వాభిమానం కాపాడుకోవడానికి, భద్రత కోసం  ఇతర మతాలలో చేరవచ్చు. తమ మతాన్ని సంస్కరించుకోవడం ద్వారానే ఈ బలహీనతలను  అధిగమించగలమని హిందు మత పెద్దలు గ్రహించాలె. యూరప్‌లో ప్రాటెస్టెంట్ ఉద్యమం  ఉధృతమైనప్పుడు క్యాథలిక్ మత పెద్దలు ప్రతి సంస్కరణోద్యమం నిర్వహించడం  గమనార్హం.    కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదరిక నిర్మూలన జరిపితే  ప్రలోభాలతో మత మార్పిడులు జరుగుతాయనే ఆందోళనకు తావుండదు. ఇతర మతాలకు హిందు  మతస్తులను చేర్చుకునే హక్కు ఉన్నట్టే హిందు మత పెద్దలకు ఇతర మతస్తులను  చేర్చుకునే హక్కు ఉంటుంది. ప్రభుత్వం ఏ మతం వైపు మొగ్గు చూపకుండా అన్ని  మతాలను సమానంగా గౌరవించాలె. ఏ మతస్తులు బలవంతానికి, ప్రలోభాలకు పాల్పడకుండా  పెద్ద మనిషి పాత్రను పోషించాలె. అన్ని మతాల పెద్దలు కూడా పరస్పరం  చర్చించుకొని సామరస్యం సాధిస్తే ఉద్రిక్తతలకు తావుండదు. మన లౌకిక,  ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవలసిన బాధ్యత మన అన్ని పక్షాలపై ఉంది.
Post Top Ad
 Your Ad Spot
Saturday, 3 January 2015
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment