'ప్లానింగ్‌'కు ప్రత్యామ్నాయ అన్వేషణ - TS TRT

Post Top Ad

Your Ad Spot

Sunday, 24 August 2014

'ప్లానింగ్‌'కు ప్రత్యామ్నాయ అన్వేషణ


నవ భారత నిర్మాణానికి పంచవర్ష ప్రణాళికలు ఎంతో దోహదం చేస్తాయని త్రికరణ శుద్ధిగా విశ్వసించడం వల్లే తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వాటిని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ,ప్రైవేటు సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటే, ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని కూడా ఆయన ఆశించారు. ప్రజా సంక్షేమానికి తోడ్పడే పథకాల రూపకల్పనకు జాతీయ స్థాయిలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆయన హయాంలోనే ఆయన ప్రారంభించిన సంస్థలూ, కార్యక్రమాలు క్రమంగా గాడి తప్పడం ప్రారంభమైంది, సోవియట్‌ యూనియన్‌ ఆదర్శంగా సమసమాజ నిర్మాణానికి పునాదులు వేశారు. ఆరోజుల్లో సోషలిజం అనే పదాన్ని ఎంతో పవిత్రమైనదిగా పాలకులు భావించేవారు. సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలడం, అమెరికా సారథ్యంలో ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడటంతో సోషలిజం క్రమంగా కనుమరుగు కావడం ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో నెహ్రూ కాలం నాటి పాలనా విధానాలు, సంప్రదాయాలు ఇంకా కొనసాగడం అవసరమా అన్న చర్చ ఇదివరకే ప్రారంభమైంది. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు అనివార్యం కావడంతో అన్ని దేశాలూ ఇప్పుడు ఆర్థిక సంస్కరణల వైపు ఎదురుచూస్తున్నాయి.మన దేశంలో వీటిని తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని దివంగత పీవీ
నరసింహారావుదే. ఆయన హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక సంస్కరణల అమలు విషయంలో శ్రద్ధ తీసుకున్నారు.దాంతో ఆర్థిక వ్యవస్థ గట్టెక్కింది. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల అమలు పేరిట ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయాన్ని ప్రారంభించింది. ఏటా పన్నెండు వేల కోట్ల రూపాయిల ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం అప్పట్లో జోరుగా సాగింది. ఆర్థిక సంస్కరణలంటే ప్రభుత్వ రంగ సంస్థల విక్రయమన్న వ్యంగ్యోక్తులు తరచుగా వినిపించేవి. నెహ్రూ కాలంలో ప్రభుత్వ సంస్థలను ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి పరచడం జరిగింది. ఈ సంస్థల్లో కొన్నింటికి ఆ తర్వాత 'నవరత్నాలు'గా నామకరణం చేయడం జరిగింది. నవరత్నాలుగా పేరొందిన సంస్థల్లో వాటాలను సైతం విక్రయించే ధోరణి ఎన్‌డిఎ హయాంలోనే ప్రారంభమైంది.ఎన్‌డిఏ ఆర్థిక సంస్కరణలను ఎద్దేవా చేసిన కాంగ్రెస్‌ పదేళ్ల క్రితం సంకీర్ణ ప్రభుత్వానికి తొలిసారిగా నేతృత్వం వహించినప్పుడు తాను చేసింది కూడా అదే. ప్రైవేటీకరణకు పెద్ద పీట వేయడమే ఆర్థిక సంస్కరణల నిర్వచనంగా స్థిరపడిపోయింది. నెహ్రూ వారసత్వాన్ని ఆయన వారసులమని చెప్పుకునే వారే పాటించనప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చిన బిజెపి పాటించాల్సిన నైతిక ధర్మం ఏమీ లేదు.అందుకే, నెహ్రూ కాలం నాటి ప్రణాళికా సంఘం స్థానే కొత్త వ్యవస్థ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలు ప్రారంభించారు.వాటిని అమలులో పెట్టేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆయన కోరుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఆయన సోషల్‌ వెబ్‌సైట్లపై ఎక్కువ ఆధారపడుతున్నారు.తన మ ంత్రివర్గ సహచరులను కూడా ఇదే పద్దతి పాటించమని ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా సలహా ఇస్తున్నారు. ఆర్థిక సంస్కరణల అమలులో కమ్యూనిస్టు చైనా మనకన్నా ఎంతో ముందు ఉంది. ప్రణాళికాబద్దమైన అభివృద్ధి ఆదర్శంగానే మిగిలిపోయింది.అరవై ఏడేళ్ళ స్వతంత్ర భారత దేశంలో అభివృద్ధి అసలు జరగలేదని ఎవరూ అనలేరు.అయితే,అంతకు ఎన్నో రెట్లు పెరిగిన అవినీతి అభివృద్ధిని మింగేసింది. అలాగే,పంచవర్షప్రణాళికల లక్ష్యం మంచిదే అయినా,వాటి అమలులో వేల కోట్ల రూపాయిల ప్రజాధనం స్వాహా కావడం వల్ల ప్రణాళికలు విఫల ప్రయోగం అనే విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి ఆ వైఫల్యం ప్రణాళికలది కాదు.వాటిని అమలు జరిపిన పాలకులది.వివిధ కార్యక్రమాలకూ, ప్రాజెక్టులకూ, పథకాలకూ జరిగిన కేటాయింపులు పొల్లుపోకుండా ఖర్చు జరిగి ఉంటే ప్రణాళికల ఫలితాలు అమోఘంగా చరిత్ర లిఖితమై ఉండేవి. పాలకుల్లో నిర్లిప్తత, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం పెరిగి పోవడం వల్లే ప్రణాళికలన్నీ నీరుగారి పోయాయి. ప్రణాళికా సంఘం పాత్ర కాలక్రమంలో కుంచించుకుని పోతూ వస్తోంది. ఆర్థిక నిపుణులు, ప్రణాళికా రచయితల అభిప్రాయాలను తోసిరాజని అధికారంలో ఉన్న నాయకులు తమకు అనుకూలమైన రీతిలో ప్రణాళికల్లో మార్పులు చేయించుకోవడం వల్లే అవి నిర్వీర్యం అవుతూ వస్తున్నాయి. అలాగే, ప్రణాళికా పెట్టుబడుల కేటాయింపులు సక్రమంగా, సంపూర్ణంగా ఖర్చు కాకపోవడం,ఖర్చు కాని నిధులను మరుసటి సంవత్సరానికి సర్దుబాటు చేయడం వంటి వాటి వల్ల కూడా ఆశించిన లక్ష్యాలు నెరవేరడం లేదు.దారిద్య్ర రేఖకు దిగువన జీవించే(బీపీఎల్‌) కుటుంబాల నిర్ధారణ విషయంలో ప్రణాళికా సంఘం నియమించిన టెండూల్కర్‌ కమిటీ రూపొందించిన లెక్కలు అపహాస్యం పాలయ్యాయి. జీవన వ్యయం పెరిగినా, ధరలు మండిపోతున్నా పట్టణాల్లో రోజుకు 37 రూపాయిలు, పల్లెల్లో 28 రూపాయిలు ఖర్చు చేయగలిగిన వారిని బిపిఎల్‌ కుటుంబాల పరిధి నుంచి తప్పించవచ్చన్న ఈ కమిటీ సిఫార్సులపై దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి చెలరేగింది. ఈ లెక్కలు శాస్త్రీయంగా లేవని ప్రణాళికా రంగంలో తలపండిన మేధావులు సైతం స్పష్టం చేశారు.దేశంలో దారిద్య్రం తగ్గి పోయిందనే అభిప్రాయాన్ని సృష్టించడం కోసమే ఈ లెక్కలు తయారు చేశారన్న ఆరోపణలు వచ్చాయి.యూపీఏ ప్రభుత్వం తాను అమలు జేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కారణంగా దారిద్య్రం బాగా తగ్గి పోయిందని గొప్పలు చెప్పుకుంది. దానికి అనుగుణంగానే ఈ లెక్కలను తయారు చేసినట్టుగా మేధావులు నిరూపణ చేయగలిగారు. ఈ నేపధ్యం నుంచి చూసినప్పుడు ప్రణాళికా సంఘం అస్తిత్వం ఏ మేరకు ఉన్నదో, ఏ స్థాయిలో ఉందో ఎవరైనా నిర్ధారణకు రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి వ్యవస్థను ఇంకా కొనసాగించడంలో అర్థం లేదని మోడీ భావించి ఉండవచ్చు. అందుకే, ప్రణాళికా సంఘాన్ని పక్కన పెట్టారు.అయితే, కాంగ్రెస్‌పైనా, నెహ్రూ వారసత్వంపైనా గుడ్డి వ్యతిరేకతతో ఆయన ప్రణాళికా సంఘంపై వేటు వేయదల్చుకున్నారంటూ పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు,నిజానికి వారిదే మూఢ నమ్మకం, నెహ్రూ ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పిననాటికీ,ఇప్పటికీ జాతీయ,అంతర్జాతీయ ఆర్థిక రంగాల్లో అనేక మార్పులు వచ్చాయి.మార్పులకు అనుగుణంగా ప్రణాళికా సంఘం వంటి వ్యవస్థల్లో మార్పులు చేసుకోవడంలో తప్పు లేదు. సరికదా అవసరం కూడా. అంతిమంగా ప్రజలకు మేలు చేకూరడమే లక్ష్యంగా ప్రణాళికలు ఉండాలి.పిడి వాదం ఎప్పుడూ ప్రమాదకరమే.
by Prabha News


No comments:

Post a Comment

Post Top Ad